అధ్యాత్మ సంకీర్తన
రేకు: 113-5
సంపుటము: 2-77
రేకు: 113-5
సంపుటము: 2-77
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
| బలువుఁడు హరిఁ జేపట్టితిని తలఁచినదెల్లా దక్కెను నాకు | ॥పల్లవి॥ |
| దురితధ్వంసుఁడు దుఃఖవిదారుఁడు అరిభయంకరుఁ డచ్యుతుఁడు సిరివరుఁ డితనినిఁ జేకొని కొలిచిన పరమసుఖమెపో భయ మెక్కడిది | ॥బలు॥ |
| దానవాంతకుఁడు దైవశిఖామణి మానరక్షకుఁడు మాధవుఁడు నానాముఖముల నాపాలఁ గలఁడు యేనెపముల నా కెదురే లేదు | ॥బలు॥ |
| అనయము నిర్మలుఁ డఖిలానందుఁడు ఘనుఁ డీశ్రీవేంకటవిభుఁడు కనుకొని మము నిటు గాచుక తిరిగీ యెనయఁగ నేలికె యితఁడే మాకు | ॥బలు॥ |


