Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 114-1
సంపుటము: 2-79
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
అదెవచ్చె నిదివచ్చె నచ్యుతు సేనాపతి
పదిదిక్కులకు నిట్టె పారరో యసురలు
॥పల్లవి॥
గరుడధ్వజంబదె ఘన శంఖరవమదె
సరుసనే విష్ణుదేవుచక్రమదె
మురవైరి పంపులవె ముందరిసేనలవె
పరచి గగ్గుల కాడై పారరో దానవులు
॥అదె॥
తెల్లని గొడుగులవె దేవదుంధుబులునవె
యెల్ల దేవతల రథాలింతటానవె
కెల్లురేఁగీ నిక్కి హరికీర్తి భుజములవె
పల్లపు పాతాళానఁ బడరో దనుజులు
॥అదె॥
వెండిపైఁడి గుదెలవె వెంజామరలవె
మెండగు కైవారాలు మించినవవె
దండి శ్రీవేంకటపతి దాడిముట్టెనదె యిదె
బండుబండై జజ్జరించి పారరో దైతేయులు
॥అదె॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము