Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 114-4
సంపుటము: 2-82
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
నిత్య పూజలివివో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి
॥పల్లవి॥
తనువే గుడియట తలయే శిఖరమట
పెనుహృదయమే హరిపీఠమటా
కనుఁగొను చూపులే ఘనదీపము లట
తనలోపలి యంతర్యామికిని
॥నిత్య॥
పలుకే మంత్రమట పాదైన నాలికే
కలకలమను పిడిఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలఁపులోపలనున్న దైవమునకు
॥నిత్య॥
గమనచేష్టలే యంగరంగగతియట
తమిగల జీవుఁడే దాసుఁడట
అమరిన వూర్పులే యాలవట్టములట
క్రమముతో శ్రీవేంకటరాయనికిని
॥నిత్య॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము