Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 114-6
సంపుటము: 2-84
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కాంబోది
చెల్ల నెక్కికొంటివిగా జీవుఁడ యీబలుకోటా
బల్లిదుఁడ నీకు నేఁడు పట్టమాయఁ గోటా
॥పల్లవి॥
తొమ్మిది గవనులైన దొడ్డతోలుఁ గోటా
కొమ్ముల చవుల మూల కొత్తళాల కోటా
వమ్ములేని మెడవంపు వంకదార కోటా
పమ్మి పగవారినెల్లా పట్టుకొన్న కోటా
॥చెల్ల॥
తలవాకిలి దంతపుతలుపుల కోటా
తలిరుఁ జేతుల పెద్దదంతెనాల కోటా
వెలియాసలనే దండువిడిసిన కోటా
గులుగై యింద్రియములు కొల్ల గొన్న కోటా
॥చెల్ల॥
నడచప్పరములనే నలువైన కోటా
జడిసిన చెవుల మించు సవరణ కోటా
పడనిపాట్లఁ బడి ఫలియించెఁ గోటా
యెడమిచ్చి శ్రీవేంకటేశుఁ డేలేఁ గోటా
॥చెల్ల॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము