Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 117-2
సంపుటము: 2-98
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
ఎంత చదివి చూచిన నీతఁడే ఘనము గాక
యింతయు నేలేటి ‌దైవ మిఁక వేరే కలరా
॥పల్లవి॥
మొదల జగములకు మూలమైనవాఁడు
తుదఁ బ్రళయమునాఁడు తోఁచేవాఁడు
కదిసి నడుమ నిండి కలిగివుండెడివాఁడు
మదనగురుఁడే కాక మఱి వేరే కలరా
॥ఎంత॥
పరమాణువైనవాఁడు బ్రహ్మాండమైనవాఁడు
సురలకు నరులకుఁ జోటయినవాఁడు
పరమైనవాఁడు ప్రపంచమైనవాఁడు
హరి యొక్కఁడే కాక అవ్వలనుఁ గలరా
॥ఎంత॥
పుట్టుగులయినవాఁడు భోగమోక్షాలైనవాఁడు
యెట్టనె‌దుర లోనను యిన్నిటివాఁడు
గట్టిగా శ్రీవేంకటాద్రి కమలా‌దేవితోడి-
పట్టపుదేవుఁడే కాక పరు లిఁకఁ గలరా
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము