Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 117-4
సంపుటము: 2-100
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
హరి యవతారమీతడు అన్నమయ్య
అరయ మా గురుడీతఁ డన్నమయ్య
॥పల్లవి॥
వైకుంఠనాథుని వద్ద వడిఁ బాడుచున్నవాఁడు
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య
ఆకశపు విష్ణుపాదమందు నిత్యమై వున్నవాడు
ఆకడీకడఁ దాళ్ళపాక అన్నమయ్య
॥హరి॥
క్షీరాబ్ధిశాయి నిట్టే సేవింపుచు నున్నవాఁడు
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య
ధీరుఁడై సూర్యమండల తేజమువద్ద నున్నవాఁడు
ఆరీతులఁ తాళ్ళపాక అన్నమయ్య
॥హరి॥
యీవల సంసారలీల యిందిరేశుతో నున్నవాఁడు
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య
భావింప శ్రీవేంకటేశు పాదములందె వున్నవాఁడు
ఆ(హా?)వభావమై తాళ్ళపాక అన్నమయ్య
॥హరి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము