అధ్యాత్మ సంకీర్తన
రేకు: 118-3
సంపుటము: 2-105
రేకు: 118-3
సంపుటము: 2-105
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| ఏమిసేతు దైవమా యెన్నఁడు గరుణించేవో దామెన సంసారములోఁ దట్టువడీ మనసు | ॥పల్లవి॥ |
| యెక్కడి పగయొకో ఇంద్రియాలు నన్నుఁబట్టి చక్కుముక్కు సేసి యెంచి సాధించీని గుక్కక యేమిసేసిన కొలయొకో వెంటవెంట వెక్కసపు పుట్టువులై వెనుతగిలీని | ॥ఏమి॥ |
| యెన్నాళ్లపాపమొకో యెడతెగక నాలోన వున్నతపుఁ గోపమై వుమ్మగిలీని తిన్ననై యెవ్వరిచేతితిట్టు దాఁకినవిధమో విన్ననై విజ్ఞానమెల్లా వీటిఁబోయఁ దుదిని | ॥ఏమి॥ |
| యే వేళ గుణమో యెడతెగని కర్మాలు రావిమాని జిగురై వూరక యంటీని శ్రీవేంకటేశుఁడ నీవు చి త్తములోపల నుండి కావఁగఁగదా నీవే గతి యనవలసె | ॥ఏమి॥ |


