Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 119-3
సంపుటము: 2-111
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
అనుచు లోకములెల్ల నదె జయవెట్టేరు
నినుఁ గొల్చితిఁ గావవే నీరజాక్షుఁడా
॥పల్లవి॥
అదివో కోనేటిలోన నదివో సర్వ తీర్థములు
అదివో పైఁడిమేడల హరినగరు
పొదలి పరుషలెల్లా పొదిగి సేవించేరు
యిదివో వరములిచ్చె నిందిరానాథుఁడు
॥అను॥
అదివో వేదఘోషము అదివో సురలమూఁక
అదివో విశ్వరూపము అద్భుతమందె
గుదిగొనెఁ బుణ్యములు కోట్ల సంఖ్యలు చేరె
యిదివో దయదలఁచె నీశ్వరేశ్వరుఁడు
॥అను॥
అదివో శ్రీవేంకటేశుఁ డక్కున నలమేల్‌మంగ
అదివో నిత్యశూరులు ఆళువారలు
నిదుల శేషాచలము నిక్కి పైపైఁ బొడచూపె
యిదివో కొలువున్నాఁడు హృదయాంతరాత్ముఁడు
॥అను॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము