అధ్యాత్మ సంకీర్తన
రేకు: 119-4
సంపుటము: 2-112
రేకు: 119-4
సంపుటము: 2-112
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: నాట
| అహోబలేశ్వరుఁ డరికులదమనుఁడు మహామహిమలను మలసీ వాఁడే | ॥పల్లవి॥ |
| కదలుఁ గన్నులును కరాళవదనము గుదిగొను భయదపుఁ గోరలును అదరు మీసములు నలరఁగ నవ్వుచు వుదుటు తోడఁ గొలువున్నాఁడు వాఁడె | ॥అహో॥ |
| అతిసిత నఖములు ననంత భుజములు వితతపరాక్రమ వేషమును అతులదీర్ఘజిహ్వయుఁ గడు మెరయఁగ మితిలేని కరుణ మెరసీ వాఁడే | ॥అహో॥ |
| సందడి సొమ్ములు శంఖచక్రములు పొందుగ దివిజులు పొగడగను యిందిరఁ దొడపై నిడి శ్రీవేంకట- మందు నిందు గడుఁ నలరీ వాడే | ॥అహో॥ |


