అధ్యాత్మ సంకీర్తన
రేకు: 120-1
సంపుటము: 2-115
రేకు: 120-1
సంపుటము: 2-115
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| చీచీ వో జీవుఁడా చింతించుకో జీవుఁడా ఆచందాన కీచందము అరుహమా జీవుఁడా | ॥పల్లవి॥ |
| వుత్తముఁడయిన హరి వుండేటి యాతుమలోన తత్తరపుఁ గాంతలను తలపోసేదా వొత్తి నారాయణనామ ముచ్చరించే నోరను రుత్త యధరపుఁదోలు రుచిగొనేదా | ॥చీచీ॥ |
| పొందుగాఁ గోవిందునిఁ బూజించేటి చేతులను సందడిఁ జన్నులమీఁద జాఁచబొయ్యేదా కందువ దేవునిరూపు కనుఁగొనే చూపులు ముందరి మర్మపుటంగములమీఁదఁ బెట్టేదా | ॥చీచీ॥ |
| వేవేలు విష్ణుకథలు వినియేటి చెవులను ఆవటించి యాడసుద్దులాలకించేదా శ్రీవేంకటేశ్వరుని సేవించే యీజీవనము భావించక విషయాల పాలు సేసేదా | ॥చీచీ॥ |


