అధ్యాత్మ సంకీర్తన
రేకు: 120-3
సంపుటము: 2-117
రేకు: 120-3
సంపుటము: 2-117
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
| అప్పుడు చూచేదివో అధికుల నధముల తప్పక యెచ్చరి యిదే తలఁచవో మనసా | ॥పల్లవి॥ |
| కొండలవంటి పనులు కోరి ముంచుకుంటే నూర- కుండి కైకొననివాఁడే యోగీంద్రుఁడు నిండిన కోపములకు నెపముల గలిగితే దండితోఁ గలఁగని యాతఁడే ధీరుఁడు | ॥అప్పు॥ |
| సూదులవంటి మాటలు సొరిదిఁ జెవి సోఁకితే వాదులు వెట్టుకొననివాఁడే దేవుఁడు పాదుకొన్న సంసారబంధము నోరూరించితే ఆదిగొని మత్తుఁడు గానెట్టివాఁడే పుణ్యుఁడు | ॥అప్పు॥ |
| గాలాలవంటి యాసలు కడుఁ దగిలి తీసితే తాలిమితోఁ గదలనాతఁడే ఘనుఁడు మేలిమి శ్రీవేంకటేశుమీఁద భారము వేసుక వీలక తనలో విఱ్ఱవీఁగువాఁడే నిత్యుఁడు | ॥అప్పు॥ |


