Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 131-1
సంపుటము: 2-121
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
ఇదివో సుజ్ఞానము 'సూత్రే మణిగణా యివ' గాన
మది నితరమే లేదు మాయల 'యద్భావం తద్భవతి'
॥పల్లవి॥
యెదుటఁగను యీజగము యీది నీవన వెఱతును
అది వీపరీతజ్ఞానము 'యద్దృష్టం తన్నష్టము' గాన
పొదులుచుండేటి యీజగము పొసఁగ నీవు గావన వెఱతు
యిది విపరీతజ్ఞానము 'సదసచ్చాహం' బంటివి గాన
॥ఇది॥
నిండిన యీజీవులు నీవేయన వెఱతును
దండనే బద్దులు వీరు 'ద్వాసుపర్ణ' వున్నది గాన
మెండగు యీజీవులను మీరు గారన వెఱతును
వుండెడి వీరలు నిత్యులు వొగి 'నహమాదిశ్చమధ్యము' గాన
॥ఇది॥
యిది మునుపె నీచిక్కు యిందుకు ద్రిష్టం బొక్కటె
తుదఁ దొల్లె నీదాసులు గలరు తుదఁ దొల్లియే నీవుఁ గలవు
వెదకు మా శ్రీవేంకటపతి నిను సేవించఁగ నిను సేవించఁగను
అదన నిన్నంటినవారల నీయంతలు సేతువుగాన
॥ఇది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము