అధ్యాత్మ సంకీర్తన
రేకు: 131-2
సంపుటము: 2-122
రేకు: 131-2
సంపుటము: 2-122
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
| ఏ దుపాయము యే నిన్నుఁ జేరుటకు ఆదినంత్యములేని అచ్యుతమూరితివి | ॥పల్లవి॥ |
| వెలయ నీగుణములు వినుతించేనంటే తెలియ నీవు గుణాతీతుఁడవు చెలరేఁగి నిను మతిఁ జింతించేనంటే మలసి నీ వచింత్య మహిముఁడవు | ॥ఏదు॥ |
| పొదిగి చేతుల నిన్నుఁ బూజించేనంటే కదిసి నీవు విశ్వకాయుఁడవు అదన నేమైన సమర్పించేనంటే సదరమై అవాప్త సకలకాముఁడవు | ॥ఏదు॥ |
| కన్నుల చేత నిన్నుఁ గనుఁగొనేనంటే సన్నిధి దొరక నగోచరుఁడవు యిన్నిటాను శ్రీవేంకటేశ నీవు గలవని వన్నెల శరణనే వాక్యమే చాలు | ॥ఏదు॥ |


