అధ్యాత్మ సంకీర్తన
రేకు: 132-1
సంపుటము: 2-127
రేకు: 132-1
సంపుటము: 2-127
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుండక్రియ
| హరిహరి నీమాయాజగమిది అండనే చూచుచు నవ్వుచును అరసి యందులో నిను భావించేటి ఆత్మభావమిది యెన్నఁడొకో | ॥పల్లవి॥ |
| సకలోద్యోగంబులు మాని సకలోపాయంబులు విడిచి సకలేంద్రయముల జాలటు మాని సకలవిషయముల రహితుఁడై సకలముఁ దనవలె భావించి సర్వాంతరాత్మవు నినుఁ దెలిసి అకలంకంబున నుండెడి భావంబది యిఁక నెన్నఁడొకో | ॥హరి॥ |
| ఘనమగు కోర్కులఁ జాలించి ఘనకోపంబు నివారించి ఘనకాముకత్వముల నటు దనిసి ఘనమగు నాసలఁ దొలఁగించి ఘనముఁ గొంచముల నినుఁ దలఁచి ఘనాఘనుఁడవు నీవనుచు అనుమానము లటు సుఖియించే దది యిఁక నెన్న డొకో | ॥హరి॥ |
| పరచింతలలోఁ దడఁబడక పరమార్గంబుల కగపడక పరహింసలకును యెన్నఁడు జొరక పరదూషణలకు నెడగిలిసి పరదేవుఁడ శ్రీవేంకటభూధరపతి నీకే శరణనుచు అరమరపుల నేఁ జొక్కితి తనిసేదది యిఁక నెన్నఁడొకో | ॥హరి॥ |


