Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 132-4
సంపుటము: 2-130
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
నెప్పున ధర్మపుణ్యము నీచేతి దింతే
యెప్పుడు గాచినఁ గావు మింతా నీచిత్తము
॥పల్లవి॥
యేవల నరుఁడు లేక యెద్దే తా దున్నునా
నీవు సేయించక వేరే నేఁ బుణ్యము సేసేనా
దేవుఁడ సూర్యుఁడు రాక తెల్లవారునా రేయి
వేవేగ నీకృపఁగాక విజ్ఞానినౌదునా
॥నెప్పు॥
కుమ్మరవాఁడు లేకే కుండ రాఁ బుట్టునా
నెమ్మి నీవు పుట్టించక నేనే పుట్టితినా
వమ్ముల రాట్నము నిలువక గుండ్రలు నిల్చునా
పమ్మి నీయప్పణ లేక భవములు మానునా
॥నెప్పు॥
మక్కువ మగఁడులేని మనువు గలుగునా
లెక్కించి యంతర్యామివి లేని నే నున్నాఁడనా
చక్కఁగ శ్రీవేంకటేశ శరణనే బుద్ధి నాకు
తక్కక నీవియ్యకుంటే దాసుడ నే నౌదునా
॥నెప్పు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము