అధ్యాత్మ సంకీర్తన
రేకు: 133-1
సంపుటము: 2-132
రేకు: 133-1
సంపుటము: 2-132
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మలహరి
| సర్వోపాయముల జగతి నాకితఁడే వుర్వీధరుఁడు పురుషోత్తముం డితఁడే | ॥పల్లవి॥ |
| సకలగంగాది తీర్థస్నానఫలము లివి స్వామిపుష్కరణి జలమే నాకు సకలపుణ్యక్షేత్రావాసయాత్ర లివి సరి వేంకటాచలవిహార మిదియే సకలవేదాధ్యయనశాస్త్రపాఠంబు లివి శౌరిసంకీర్తనం బిదియే నాకు సకలకర్మానుష్ఠానముల యితని కిచ్చటఁ జాతుపడి కైంకర్య మిదియే | ॥సర్వో॥ |
| ఉపవాసతపములివి యితని ప్రసాదంబులొగి భుజింపుటే నాదు దినదినంబు జపరహస్యోపదేశంబు లితనిపాదజలంబులు శరణనేటి సేవ యొకటే ఉపమింపఁ బుణ్యపురుషుల దర్శనము నాకు నొగి నిచటి బహువృక్షదర్శనంబు యెపుడుఁ బుణ్యకథాశ్రవణంబు లిచ్చోటి యెన్నఁగల బహుపక్షికలకలంబు | ॥సర్వో॥ |
| తలఁపుగల యోగంబులందు శ్రీవైష్ణవులఁ దగులు సంవాససహయోగంబు వెలయ నిండుమహోత్సవంబులిన్నియు నితనివిభవంబులెసఁగు తిరునాళ్ళు నాకు చెలఁగి యిటు దేవతాప్రార్థనింతయు నాకు శ్రీవేంకటేశ్వరుని శరణాగతి అలరు నాసంపదలు యితని పట్టపురాణి అలమేలుమంగ కడకంటిచూపు | ॥సర్వో॥ |


