Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 133-3
సంపుటము: 2-134
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
షోడశకళానిధికి షోడశోపచారములు
జాడతోడ నిచ్చలును సమర్పయామి
॥పల్లవి॥
అలరు విశ్వాత్ముకున కావాహన మిదె పర్వ-
నిలయున కాసనము నెమ్మి నిదె
అల గంగాజనకున కర్ఘ్యపాద్యాచమనాలు
జలధిశాయికిని మజ్జన మిదె
॥షోడ॥
వర పీతాంబరునకు వస్త్రాలంకార మిదె
సరి శ్రీమంతునకు భూషణము లివె
ధరణీధరునకు గంధపుష్ప ధూపములు
తిర మిదె కోటిసూర్యతేజునకు దీపము(???)
॥షోడ॥
అమృతమథనునకు నదివో నైవేద్యము
గమిఁ జంద్రనేత్రునకుఁ గప్రవిడెము
అమరిన శ్రీవేంకటాద్రిమీఁది దేవునికి
తమితోఁ బ్రదక్షిణాలు దండములు నివిగో
॥షోడ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము