Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 133-4
సంపుటము: 2-135
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
ఏమీ నెఱఁగనినాఁడు యిటు నిన్నుఁ గొలిచేనా
నీమాయ దెలుపఁగా నిను ననేఁ గాకా
॥పల్లవి॥
పసురముగఁ జేసితే బడి నిన్నుఁ దలఁచేనా
వెస రాయిఁ జేసితే వెదికి నిన్నెఱిఁగేనా
పొఁసగ మానుగ నన్నుఁ బుట్టించితేఁ బొగడేనా
ముసిపి నరుఁ జేయఁగా మొరయిడేఁ గాక
॥ఏమీ॥
మొగి మృగముఁ జేసితే మొక్కనెఱిఁగెనా
తగఁ బక్షి జేసితేఁ దరిఁ బూజ సేసేనా
జిగి నితరజంతువుగఁ జేసితేఁ దగిలేనా
అగపడి వివేకిఁ జేయఁగననేఁ గాక
॥ఏమీ॥
యింత కధికారిఁ జేసి యీప్రపంచజ్ఞాన-
మింత యొసఁగితివి మరఁ గిఁకనేలా
చింత లిన్నియుఁ దీర శ్రీవేంకటేశ నను
సంతతము నేలఁగా శరణనేఁ గాక
॥ఏమీ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము