అధ్యాత్మ సంకీర్తన
రేకు: 134-2
సంపుటము: 2-138
రేకు: 134-2
సంపుటము: 2-138
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గుజ్జరి
| ఇందరిలో నేమెందుఁ బోలుదుము యిందరిఁ బోలిన జీవులమే కందువ వీరలఁ దలఁచి చిత్తమిది కలఁగెడి దైవమ కావఁగదే | ॥పల్లవి॥ |
| యెందరొకో జరాదుఃఖము లేచి యనుభవించేటివారు యెందరొకో దరిద్రదుఃఖము లెఁసగి యలమటించేటివారు యెందరొకో బంధనతాడనహీనదెసల నుండెడివారు యెందరొకో దాసదాస్యవిధి నెడయరాక చెఱలయినవారు | ॥ఇంద॥ |
| యెందరొకో మరణదెసలచే నిల సంయోగవియోగదుఃఖితులు యెందరొకో జన్మరోగముల నెక్కువ భయమందేటివారు యెందరొకో రాజుల చోరుల హింసలకు లోన యినవారు యెందరొకో పొడమిన జీవుల కెక్కడ నెక్కడ నేపాటో | ॥ఇంద॥ |
| యెందరొకో యీదుఃఖనివృత్తికి యెడసి మిమ్ముఁ గొలిచినవారు యెందరొకో సంపదలకు లోనై యేతాయాతనఁ బడువారు యెందరొకో శ్రీవేంకటేశ యిపు డెక్కువ నీశరణము చొచ్చి యిందును నందును సుఖులై లోకుల నిందరిఁ జూచుచు నవ్వెడివారు | ॥ఇంద॥ |


