Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 134-4
సంపుటము: 2-140
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవి
ఇందుకుఁ జింతించనేల యీశ్వరుని మాయ లివి
యెందుకు మూలము హరి యీతనిఁ జింతించరే
॥పల్లవి॥
అల నారికడపుఁ గాయకు నీరు వచ్చినయట్టు
తలఁచి రాఁగల మేలు తన్నుఁ దానే వచ్చురే
లలి నేనుగుదిన్న వెలఁగపంటి బేసము-
వలెనే పోఁగలవెల్ల వడిఁ దానే పోవురే
॥ఇందు॥
నిండిన యద్దములోన నీడ వొడచూపినట్టు
దండియైన పుట్టుగులు తన్నుఁ దానే వచ్చురే
పండిన పండ్లు తొడమఁబాసి వూడినయట్టు
అండనే మరణములు అందరికి సరిరే
॥ఇందు॥
పెనురాతిపై గడవ పెట్టగాఁ గుదురై నట్టు
తనుఁదానే చింతింపఁ దలఁపు నిలుచురే
ఘనుఁడు శ్రీవేంకటేశుఁ గని శరణన్నఁ జాలు
వెనక పాపాలు మంచు విచ్చినట్టు విచ్చురే
॥ఇందు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము