అధ్యాత్మ సంకీర్తన
రేకు: 134-5
సంపుటము: 2-141
రేకు: 134-5
సంపుటము: 2-141
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
| చూచే చూపొకటి సూటిగుఱి యొకటి తాచి రెండు నొకటైతే దైవమే సుండీ | ॥పల్లవి॥ |
| యేనుగఁ దలఁచితే యేనుగై పొడచూపు మాను దలఁచిన నట్టే మానై పొడచూపు పూని పెద్దకొండ దలపోయఁ గొండై పొడచూపు తానే మనోగోచరుఁడు దైవమే సుండీ | ॥చూచే॥ |
| బట్టబయలు దలఁచ బయలై పొడచూపు అట్టె యంబుధి దలఁచ నంబుధియై పొడచూపు పట్టణము దలఁచిన పట్టణమై పొడచూపు తట్టి మనోగోచరుఁడు దైవమే సుండీ | ॥చూచే॥ |
| శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతి దలఁచితేను శ్రీవేంకటాద్రిమీఁది శ్రీపతై పొడచూపు భావమే జీవాత్మ ప్రత్యక్షము పరమాత్మ తావు మనోగోచరుఁడు దైవమే సుండీ | ॥చూచే॥ |


