Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 135-5
సంపుటము: 2-146
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
మఱియెందూ గతిలేదు మనుప నీవే దిక్కు
జఱసి లక్ష్మీశ నీ శరణమే దిక్కు
॥పల్లవి॥
భవసాగరంబులోఁబడి మునిఁగిన నాకు
తివిరి నీనామమను తేపయే దిక్కు
చివికి కర్మంబనెడి చిచ్చు చొచ్చిన నాకు
జవళి నాచార్యు కృపాజలధియే దిక్కు
॥మఱి॥
ఘనమోహపాశముల గాలిఁ బొయ్యెడి నాకు
కొనల నీ పాదచింతకొమ్మయే దిక్కు
కనలి మనసనెడి యాకాసముననున్న నాకు
కనుఁగొనఁగ నీదాస్యగరుడఁడే దిక్కు
॥మఱి ॥
మరిగి సంసారమనెడి మంటికిందటి నాకు
ధర భక్తియను బిలద్వారమే దిక్కు
యిరవైన శ్రీవేంకటేశ యిన్నిటా నాకు-
నరుదైన నీవంతరాత్మవే దిక్కు
॥మఱి ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము