Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 135-6
సంపుటము: 2-147
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
శ్రీపతి నీయాజ్ఞ సేసెద మిదివో
పూఁపల మాయలఁ బొరలఁగనేలా
॥పల్లవి॥
కాయము సుఖదుఃఖములకు మూలము
పాయము యింద్రియపరవశము
ఆయము రెంటికి నన్నపానములు
మోయని మోఁపిది ములుగఁగనేలా
॥శ్రీప॥
తలఁపు పుణ్యపాతకముల మూలము
కలిగిన పుట్టువు కర్మగతి
ఫల మిది రెంటికి బలుసంసారము
కలిగిన వెట్టికి కాదననేలా
॥శ్రీప॥
జీవుఁ డింతటా సృష్టికి మూలము
భావము బ్రకృతికిఁ బ్రపంచము
చేవగ రెంటికి శ్రీవేంకటేశ్వర
నీ వంతరాత్మవు నెమకఁగనేలా
॥శ్రీప॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము