అధ్యాత్మ సంకీర్తన
రేకు: 136-3
సంపుటము: 2-150
రేకు: 136-3
సంపుటము: 2-150
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: రామక్రియ
| మెచ్చు; మెచ్చకుంటే మాను; మించి నే నాడకమాన అచ్చపు నీసూత్రధారి నవధారు దేవ | ॥పల్లవి॥ |
| వొక్కఁడ నే జీవుఁడను వోహో హరీ పెక్కు బహురూపాలే పెంచి యాడితి తక్కిన యింద్రియములే తగుమేళము అక్కజపు విద్యవాఁడ నవధారు దేవ | ॥మెచ్చు॥ |
| సూటి నించుకంతవాఁడఁ జూడవే హరీ వీటి సంసారపుబారి విద్య లాడితి పాటి నాకర్మమే క్రియాభాషాంగము ఆటవాఁడ నింతే నేను అవధారు దేవ | ॥మెచ్చు॥ |
| చేరి చిత్తగించుమీ శ్రీవేంకటేశ నేఁడు మేరతో భక్తెనే మోకుమీఁద నాడేను యీరానిపదవులు యిచ్చితి నాకు ఆరితేరి గెలిచితి నవధారు దేవ | ॥మెచ్చు॥ |


