Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 136-6
సంపుటము: 2-153
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగం
ఉన్న మంత్రా లిందు సరా వొగి విచారించుకొంటే
విన్న కన్న వారికెల్ల విష్ణునామమంత్రము
॥పల్లవి॥
పరగఁ బుచ్చకాయలఁ బరసిపోదు మంత్రము
గరిమ ముట్టంటులేని ఘనమంత్రము
వరుస నెవ్వరువిన్నా వాఁడిచెడని మంత్రము
అరయ నిదొక్కటేపో హరినామమంత్రము
॥ఉన్న॥
యేజాతినోరికైన నెంగిలిలేని మంత్రము
వోజదప్పితేఁ జెడకవుండే మంత్రము
తేజాన నొకరికిస్తేఁ దీరిపోని మంత్రము
సాజమైన దిదేపో సత్యమైన మంత్రము
॥ఉన్న॥
యిహముఁ బరముఁ దానే యియ్యఁజాలిన మంత్రము
సహజమై వేదాలసార మంత్రము
బహునారదాదులెల్ల పాటపాడిన మంత్రము
విహితమయిన శ్రీవేంకటేశు మంత్రము
॥ఉన్న॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము