అధ్యాత్మ సంకీర్తన
రేకు: 137-2
సంపుటము: 2-155
రేకు: 137-2
సంపుటము: 2-155
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: లలిత
| కటకటా కర్మమా కాలములో మర్మమా మటమాయైపోతివంటా మది నమ్మివుంటిఁగా | ॥పల్లవి॥ |
| పాపబుద్ధి యాడనుండె పాయము రానినాఁడు కోప మేడనుండె గర్భగోళమున నున్ననాఁడు దీపన మేడనుండె దేహధారి గానినాఁడు యేపున భూమిఁ బుట్టితే నేడనుండి వచ్చెనో | ॥కట॥ |
| నగుసంసార మెందుండె నరకాన నుండునాఁడు తగిలి మరణదెస ధనవాంఛ లెందుండె వొగి లోభ మేడనుండె వొంటినున్నవాఁడు వెగటై నేఁడెట్టు నన్ను వెదకి పైకొనెనో | ॥కట॥ |
| బహుబంధా లేడనుండె ప్రళయకాలమునాఁడు మహిఁ గోరికెలెందుండె మతి మఱచిననాఁడు యిహమున శ్రీవేంకటేశు శరణంటి నేఁడు విహితమై మాకు నెట్టు వెఱచెనో తాము | ॥కట॥ |


