అధ్యాత్మ సంకీర్తన
రేకు: 137-3
సంపుటము: 2-156
రేకు: 137-3
సంపుటము: 2-156
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సామంతం
| హరి నీ ప్రతాపమున కడ్డమేది లోకమున సరి వేరీ నీకు మరి సర్వేశ్వరా | ॥పల్లవి॥ |
| నీవు నీళ్ళు నమలితే నిండెను వేదములు యీవలఁ దలెత్తితేనే యింద్రపదవులు మించె మోవ మూఁతి గిరిపితే మూడులోకాలు నిలిచె మోవిఁ బార నవ్వితేనే ముగిసి రసురలు | ॥హరి॥ |
| గోర గీరితే నీరై కొండలెల్లఁ దెగఁబారె మారుకొంటే బయటనే మడుగులై నిలిచె చేరి యడుగువెట్టితే శిలకుఁ బ్రాణము వచ్చె కూరిమిఁ గావలెనంటే కొండ గొడగాయను | ॥హరి॥ |
| కొంగుజారినంతలోనే కూలెను త్రిపురములు కంగి గమనించితేనే కలిదోషములు మానె రంగుగ నీశరణంటే రక్షించితి దాసులను ముంగిట శ్రీవేంకటేశ మూలమవు నీవే | ॥హరి॥ |


