Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 137-4
సంపుటము: 2-157
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాక్షి
మాపులే మరణములు రేపులే పుట్టువులు
చాపలాలు మాని విష్ణు శరణను మనసా
॥పల్లవి॥
చాలునంటే యించుకంతే చాలును జన్మమునకు
చాలకున్న లోకమెల్లఁ జాలదు
వీలిన యీయాసా వెర్రివాని చేతిరాయి
చాలు నింక హరి నిట్టె శరణను జీవుఁడా
॥మాపు॥
పాఱకున్న పశుబాలై బడలదు మనసు
పాఱితే జవ్వనమునఁ బట్టరాదు
మీఱిన నీరుకొద్ది దామెర యింతె యెంచి చూడ
జాఱవిడిచి దేవుని శరణను జీవుఁడా
॥మాపు॥
సేయకున్నఁ గర్మము శ్రీపతిసేవనే వుండు
సేయఁబోతేఁ గాలమెల్లా సేనాసేన
వోయయ్య యిది యెల్లా వుమినాఁకే చవుతాలు
చాయల శ్రీవేంకటేశు శరణను జీవుఁడా
॥మాపు॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము