అధ్యాత్మ సంకీర్తన
రేకు: 137-6
సంపుటము: 2-159
రేకు: 137-6
సంపుటము: 2-159
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
| వట్టి లంపటాలఁ బడి వడఁ బొరలుటకంటే వొట్టిన విరతి నూరకుండుటే సుఖము | ॥పల్లవి॥ |
| పాపము మానినయట్టి బదుకొక్కటె సుఖము కోపము విడిచినట్టి గుణమొక్కటి సుఖము చేపట్టి గురుబుద్ధి సేసేటిదే సుఖము తీ- దీపులఁ బడనియట్టి దినమే సుఖము | ॥వట్టి॥ |
| మహిఁ జంచలములేని మనసొక్కటి సుఖము సహజాచారముతోడి జన్మమొక్కటి సుఖము యిహపరసాధనపు యెన్నికొక్కటి సుఖము బహుళపు టాసకంటె పరిపాటి సుఖము | ॥వట్టి॥ |
| పరులఁ బీడించితేని పసిఁడొక్కటి సుఖము గరిమ నిజముతోడఁగల మాటలే సుఖము ధరలో శ్రీవేంకటేశు దాసానుదాఁడయి సరవితో నడచేటి శాంతమే సుఖము | ॥వట్టి॥ |


