Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 138-1
సంపుటము: 2-160
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
వారిదే పో జన్మము వడి నిన్నుఁ దెచ్చిరి
భారతరామాయణాలై పరగె నీకథలు
॥పల్లవి॥
భువిమీఁద రావణుఁడు పుట్టగాఁగా రాముఁడవై
తవిలి యిందరికిఁ బ్రత్యక్షమైతివి
వివరింప నంతవాఁడు వెలసితేఁగా నీవు
అవతార మందితే నిన్నందరునుఁ జూతురు
॥వారి॥
రమణఁ గంసాది యసురలు లూటి సేయఁగాఁగా
తమిఁ గృష్ణావతార మిందరి కైతివి
గములై యంతటివారు గలిగితేఁగా నీవు నేఁడు
అమర జనించి మాటలాడుదు విందరితో
॥వారి॥
యెంత వుపకారియో హిరణ్యకశిపుఁడు
చెంత నరసింహుఁడ నీసేవ యిచ్చెను
యింతట శ్రీవేంకటేశ యిన్ని రూపులును నీవే
పంతాన నీశరణని బ్రదికితి మిదివో
॥వారి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము