Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 139-1
సంపుటము: 2-166
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భూపాళం
ఇదివో మాయింట నేఁడు యింతసేసెఁ గృష్ణుఁడు
అదివో మాయింటాను అంతసేసెఁ గృష్ణుడు
॥పల్లవి॥
గంట వాఁగకుండా నిండఁ గసపు దురిగి మా-
యింటివారు నిద్దిరించ నిల్లుచొచ్చెను
అంటివచ్చి వొకదూడ ఆపూరి మేసితేను
గంట గణగణ వాఁగె గక్కన మేల్కంటిమి
॥ఇది॥
వొక్కరోలు దాపు వెట్టి వుట్టియెక్కి అందుమీఁది-
చక్కెరల్లా మెసఁగి మాచంటివానిని
వుక్కఁ బట్టి వుట్టిమీఁద నునిచి రోలు దీసె
చొక్కి తా నెందున్నాఁడో చొప్పు ఇదే కంటిమి
॥ఇది॥
ఆవుల వెళ్ళవిడిచె నవి నేఁ దోలి తేఁబోతే
నీవల దూడలఁ దెచ్చి యింటిలోఁ గట్టె
దావతి నింతా వెదకి తలుపు దెరచితేను
శ్రీవేంకటేశుని మాయఁ జిక్కి లోన నున్నవి
॥ఇది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము