అధ్యాత్మ సంకీర్తన
రేకు: 139-4
సంపుటము: 2-169
రేకు: 139-4
సంపుటము: 2-169
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
| నీవు జగన్నాథుఁడవు నే నొకజీవుఁడ నింతే నీవలె ననుభవించ నే నెంతవాఁడను | ॥పల్లవి॥ |
| వైకుంఠపదమేడ వడిఁ గోర నెంతవాఁడ యీకడ నీదాసుఁడనౌ టిది చాలదా చేకొని నీసాకారచింత యేడ నేనేడ పైకొని నీడాగు మోచి బ్రదికితిఁ జాలదా | ॥నీవు॥ |
| సొంపుల నీయానందసుఖ మేడ నేనేడ పంపు శ్రీవైష్ణవసల్లాపన చాలదా నింపుల విజ్ఞాన మేడ నే దెలియ నెంతవాఁడ యింపుగా నీకథ వినుటిదియే చాలదా | ॥నీవు॥ |
| కై వల్యమందు నీతో కాణాచి యాడ నాకు శ్రీవేంకటాద్రిమీఁది సేవ చాలదా యీవల శ్రీవేంకటేశ నీ విచ్చిన విజ్ఞానమున భావించి నిన్నుఁ బొగడే భాగ్యమే చాలదా | ॥నీవు॥ |


