Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 140-2
సంపుటము: 2-173
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ముఖారి
ఏరీతి నెవ్వరు నిన్ను నెట్టు భావించినాను
వారివారి పాలికి వరదుఁడవౌదువు
॥పల్లవి॥
చేరికొల్చినవారికిఁ జేపట్టుఁ గుంచమవు
కోరి నుతించినవారికి కొంగుపైఁడివి
మేరతోఁ దలఁచువారి మేటినిధానమవు
సారపు వివేకులకు సచ్చిదానందుఁడవు
॥ఏరీ॥
కావలెననేవారికి కామధేనువవు మరి
సేవసేసేవారికి చింతామణివి
నీవే గతెన్నవారికి నిఖిల రక్షకుఁడవు
వావిరి శరణువేఁడేవారి భాగ్యరాశివి
॥ఏరీ॥
నిన్నుఁ బూజించేవారి నిజపరతత్త్వమవు
ఇన్నిటా నీదాసులకు నేలికెవు
యెన్నఁగ శ్రీవేంకటేశ యిహపరములకును
పన్ని కాచుకున్నవారి ఫలదాయకుఁడవు
॥ఏరీ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము