అధ్యాత్మ సంకీర్తన
రేకు: 140-3
సంపుటము: 2-174
రేకు: 140-3
సంపుటము: 2-174
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
| ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు మతి వారూఁ దమవంటి మనుజులే కాక | ॥పల్లవి॥ |
| చేరి మేలుసేయఁ గీడుసేయ నెవ్వరు గర్తలు ధారుణిలో నరులకు దైవమే కాక సారెఁ దనవెంటవెంటఁ జనుదెంచేవారెవ్వరు బోరునఁ జేసిన పాపపుణ్యాలే కాక | ॥ఇత॥ |
| తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు గుడికొన్న తనలోని గుణాలే కాక కడుఁగీర్తి నపకీర్తి గట్టెడివారెవ్వరు నడచేటి తనవర్తనములే కాక | ॥ఇత॥ |
| ఘనబంధమోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు ననిచిన జ్ఞానాజ్ఞానములే కాక తనకు శ్రీవేంకటేశుఁ దలపించేవా రెవ్వరు కొనమొద లెఱిఁగిన గురుఁడే కాక | ॥ఇత॥ |


