Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 140-5
సంపుటము: 2-176
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
చొచ్చితి నీకు శరణు సుద్దు లిఁకనేఁటికి
కచ్చుపెట్టెవ్వరివల్లాఁ గలిగే దేమీ
॥పల్లవి॥
పుట్టుక మునుపెఱఁగ పుట్టుగు మీఁదెఱఁగను
యిట్టె యప్పటి యెఱుక యేడ కెక్కీని
పట్టె మదనుభూతము పరసిపోయను బుద్ధి
వట్టి పెద్దతనాలను వచ్చేదేమీ
॥చొచ్చి॥
రానివి రప్పించఁగ నేరను వచ్చే వాఁప నేర
తానకపు నాస్వతంత్ర మెందాఁకా వచ్చును
అనుకున్నది ముదిమి అట్టె జారె శాంతము
నే నెంత విఱ్ఱవీఁగినా నిండేదేమీ
॥చొచ్చి॥
యిప్పుడు నే నెవ్వఁడనో యెక్కడ నీ వున్నాఁడవో
కప్పిన నావుపాయాలే కార్యమిచ్చీని
నెప్పున శ్రీవేంకటేశ నీయెదుటఁబడ్డ పని
తప్పక యీడేర్తు గాక తలపోసేదేమీ
॥చొచ్చి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము