Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 140-6
సంపుటము: 2-177
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
చేసిన నావిన్నపము చిత్తానఁ బెట్టుకొమ్మీ
వేసరించి యిప్పుడే నే వేఁడుకొంటిఁ జుమ్మీ
॥పల్లవి॥
ముందె నాపుణ్యఫలములు నీ కిచ్చితినంటి
కందువఁ గోరనని సంకల్పించితిని
యిందు మఱచి తప్పినా యిన్ని నీకె సెలవు
నిందవేసి నన్ను నిఁక నేరము లెంచకుమీ
॥చేసి॥
నిన్నేకాని యితరుల నేఁ గొలువనొల్ల నంటి
వున్నతిఁ బరద్రవ్యా లొల్లనంటి
అన్నిటా నేనే మఱి యప్పటిమాటే యంచు
సన్నల నన్నందుకు నొచ్చమని దూరకుమీ
॥చేసి॥
నానా వుపాయాల నాఁడే శరణంటి
పూని నీసాకారమునేఁ బొడగంటిని
నేను మత్తుఁడనై వున్నా నీవే తలఁచి తెలుపుకో
కోనేటి శ్రీవేంకటేశ కొసరించుకోకుమీ
॥చేసి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము