Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 141-1
సంపుటము: 2-178
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శుద్ధవసంతం
దీనరక్షకుఁ డఖిలవినుతుఁడు దేవదేవుఁడు రాముఁడు
జానకీపతిఁ గొలువుఁడీ ఘనసమరవిజయుఁడు రాముఁడు
॥పల్లవి॥
హరుని తారకబ్రహ్మమంత్రమై యమరిన యర్థము రాముఁడు
సురలఁ గాచి యసురల నడఁచిన సూర్యకులజుఁడు రాముఁడు
సరయువందును ము క్తిచూరలు జనుల కొసఁగెను రాముఁడు
హరియె యీతఁడు హరివించుల కాదిపురుషుఁడు రాముఁడు
॥దీన॥
మునులరుషులకు నభయమొసఁగిన మూలమూరితి రాముఁడు
మనసులోపలఁ బరమయోగులు మరుగుతేజము రాముఁడు
పనిచి మీఁదటి బ్రహ్మపట్టము బంటు కొసఁగెను రాముఁడు
మనుజవేషముతోడ నగజకు మంత్రమాయను రాముఁడు
॥దీన॥
బలిమి మించిన దైవికముతో భక్తసులభుఁడు రాముఁడు
నిలిచి తనసరిలేని వేలుపు నిగమవంద్యుఁడు రాముఁడు
మెలుపు శ్రీవేంకటగిరీంద్రముమీఁది దేవుఁడు రాముఁడు
వెలసె వావిలిపాటి లోపలి వీరవిజయుఁడు రాముఁడు
॥దీన॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము