Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 141-2
సంపుటము: 2-179
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: బౌళి
తెలిసినమాటలు నీసముఖంబున దీకొని ని న్నడుగకపోదు
సులభుఁడ వన్నిట ప్రాణనాథుఁడవు చొప్పుగ నానతి యియ్యఁ గదే
॥పల్లవి॥
నీవే బలవంతుఁడవో నీకంటేఁ గర్మము బలువో
కైవసముగ నే నెంచిచూచితే కర్మముకంటె బలువుఁడవు
భూవలయంబుల ప్రారబ్ధంబులు భోగించవలెనని యంటివా
వావిరి నిట్టైతే నీదేవత్వమునకు వెలితిగదే
॥తెలి॥
ఐనాఁగాని లోకములోపల నది నీ యాజ్ఞని తలఁచితిమా
నేను నీశరణుచొచ్చిన మీఁదట నీవే పరిహరించఁగవలదా
కానిపించు నాకిఁక నొకబుద్ధి కర్మముపై నెప మటువేసి
పూనుచుఁ గాలక్షేపంబునకై భువిని వినోదము గాఁబోలు
॥తెలి॥
యెందాఁకా జీవులతోడుత నీ వేలాటంబులు జరపెదవు
అందరికిని నీవే తలిదండ్రివి అయి రక్షింపుచునున్నాఁడవు
కందువ దెలిసెను శ్రీవేంకటేశ్వర కర్త వెట్టు చేసిన మేలు
చందమాయ నిది దగవౌ నీకును సంతోషించితి మిటు నేము
॥తెలి॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము