Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 141-3
సంపుటము: 2-180
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: వరాళి
ఏమని పొగడవచ్చు నిటువంటిది నీమాయ
కామించి బ్రహ్మాదులనుఁ గప్పీ నీమాయ
॥పల్లవి॥
బచ్చెనరూపుల పెక్కు పడెచ్చుల వేసినట్లు
నిచ్చల నినుచున్నది నీమాయ
తచ్చి వారివారిరతి తమతమకే తెలియ
పచ్చిగా భోగింపించీ దంపతుల నీమాయ
॥ఏమ॥
మఱి తొలునాటి భోగాలు మరునాటికి నింతగా
నెఱువుగాఁ దమకించీ నీమాయ
విఱచరాని దుఃఖము వెస నిద్రవోయితేనే
మఱపించి నవ్వించీ మహిలో నీమాయ
॥ఏమ॥
పట్టరాని జవ్వనము పరసిపోతే ముదిమి
నెట్టుకొల్పి వుబ్బఁడచీ నీమాయ
గట్టిగా శ్రీవేంకటేశ ఘనుఁడవైన నీదాసుల
పట్టకుండాఁ జేయుము బలిసె నీమాయ
॥ఏమ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము