Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 142-2
సంపుటము: 2-184
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: మాళవిగౌళ
నేరఁగల దొక్కటె నిశ్చలబ్రహ్మవిద్య
వారివారి యంతర్యామే వచ్చి పెరరేఁచీని
॥పల్లవి॥
వొక్కరు నేర్పఁగవద్దు వొగి సంసారధర్మము
దిక్కై పుట్టించిన ప్రకృతియ నేర్పీని
గుక్కక జంతులు చన్నుగుడుప నేరుపవద్దు
చక్కగా ననాదివానలే నేర్పీని
॥నేరఁ॥
అంచ నెవ్వరు నిద్రవొమ్మని బుద్ధి చెప్పవద్దు
మించి వారి తమోగుణమే కప్పీని
కొంచక భజియించుమని కోరి యచ్చరించవద్దు
పెంచిన తనఁయాకలే పిలిచి తెచ్చీని
॥నేరఁ॥
అట్టె పనిపాటల అలవాటు చూపవద్దు
యెట్టైనా తనజాతే సేయిపించీని
వొట్టుక శ్రీవేంకటేశుఁ డున్నాఁడు కోనేటిదండ
పట్టి కొలిచినవారే భాగ్యవంతు లిలను
॥నేరఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము