Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 142-3
సంపుటము: 2-185
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శంకరాభరణం
అది నేనెఱఁగనా అంతలో భ్రమతుఁ గాక
మదనజనక నాకు మంచి బుద్ధియియ్యవే
॥పల్లవి॥
యెంత లోకానుభవము అంతయు వ్రిథా నష్టి
కొంతైనా బ్రహ్మచింత కోటిలాభము
వింతైన జనులతోడి వినోదము నిష్ఫలము
చెంత సజ్జనసంగతి చేరిన యాదాయము
॥అది॥
నానాదేశవార్తలు నడుమఁ జింతామూలము
పూనిన పురాణగోష్ఠి పుణ్యమూలము
ఆనిన కృషివాణిజ్యాలన్నియుఁ దీరనివెట్టి
మానని యాచారమాత్మకుఁ బడ్డపాటు
॥అది॥
పలు చుట్టరికములు బట్టబయలు తగుళ్ళు
చెలఁగు నాచార్యసేవ జీవన్ముక్తి
బలిమి శ్రీవేంకటేశ పరగ రెండువిధాలు
నిలుకడయిన వాఁడవు నీవే యిన్నిటికి
॥అది॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము