Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 142-4
సంపుటము: 2-186
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేవగాంధారి
ఒక్కఁడే మోక్షకర్త వొక్కటే శరణాగతి
దిక్కని హరిఁ గొల్చి బదికిరి తొంటివారు
॥పల్లవి॥
నానా దేవతలున్నారు నానా లోకములున్నవి
నానా వ్రతాలున్నవి నడచేటివి
జ్ఞానికిఁ గామ్యకర్మాలు జరపి పొందేదేమి
ఆనుకొన్న వేదోక్తాలైనానాయఁ గాక
॥ఒక్కఁ॥
వొక్కండు దప్పికి ద్రావు వొక్కడు కడవ నించు
నొక్కఁ డీఁదులాడు మడుగొక్కటి యందే
చక్క జ్ఞానియైనవాఁడు సారార్థము వేదమందు
తక్కక చేకొనుఁ గాక తలకెత్తుకొనునా
॥ఒక్కఁ॥
యిది భగవద్గీతార్థమిది యర్జునునితోను
యెదుటనే వుపదేశమిచ్చెఁ గృష్ణుఁడు
వెదకి వినరో శ్రీవేంకటేశు దాసులాల
బ్రదుకుఁ ద్రోవ మనకు పాటించి చేకొనరో
॥ఒక్కఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము