Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 143-3
సంపుటము: 2-191
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: ఆహిరి
ఎంత మహిమో నీది యెవ్వరి కలవిగాదు
చింతించితే దాసులకుఁ జేపట్టుఁ గుంచమవు
॥పల్లవి॥
వూరకే నిన్నెవ్వరికి యుక్తుల సాధింపరాదు
సారెకుఁ దర్కవాదాల సాధింపరాదు
ఆరసి వెదకి ఉపాయముల సాధింపరాదు
భారములేనియట్టి భ క్తసాధ్యుఁడవు
॥ఎంత॥
మిక్కుటపు సామర్థ్యాన మెరసి తెలియరాదు
ధిక్కరించి నేర్పులఁ దెలియరాదు
వెక్కసాన భూముల వెదకి తెలియరాదు
మొక్కి నీకు శరణంటే ముందర నిలుతువు
॥ఎంత॥
చెలరేఁగి తపములు చేసినా నెఱఁగరాదు
యిల నెన్ని చదివినా నెఱఁగరాదు
నెలవై శ్రీవేంకటేశ నీదాసానుదాసులఁ
గొలిచితేఁ జాలు గక్కునఁ గృపసేతువు
॥ఎంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము