అధ్యాత్మ సంకీర్తన
రేకు: 143-4
సంపుటము: 2-192
రేకు: 143-4
సంపుటము: 2-192
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: కన్నడగౌళ
| నీవు నన్ను రక్షించితే నింద నీపైఁ బడదు భావించి నన్నెట్టయినా బ్రదికించుకొనవే | ॥పల్లవి॥ |
| సంతతము నన్నెంచితే సర్వాపరాధి నేను యెంత నే వేమిచేసినా నంత కర్హుఁడ అంతటి లోకజననియైన లక్ష్మిఁ జూచి కాని అంతరాత్మ నిన్నుఁ జూచియైనా మన్నిఁ చవే | ॥నీవు॥ |
| కలవెన్నైనాఁ దప్పులు కనఁగొన నావల్ల చెలఁగి యందుకుఁ బ్రాయశ్చిత్తము లేదు లలి నాభుజము చక్రలాంఛనము చూచి కాని అల నానోరిమంత్రమైనాఁ జూచి యేలుమీ | ॥నీవు॥ |
| మతి నిన్నెఱిఁగేనంటే మదోన్మత్తుఁడ నేను గతి యేది నాకు శ్రీవేంకటగిరినాయక సతతము నీబిరుదు సారెకుఁ జూచి కాని ప్రతిలేని నీదయయైనా భావించి చేకొనవే | ॥నీవు॥ |


