Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 144-2
సంపుటము: 2-195
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: పాడి
విష్ణుఁడే యింతానని భావించుటే బుద్ధి
వైష్ణవుఁడై యాచార్యసేవ సేయుటే బుద్ధి
॥పల్లవి॥
కొండవంటి తనలోని కోపము రేఁగవచ్చితే
దండనే యెచ్చరి వూరకుండుటే బుద్ధి
మెండుగా బరకాంతలమీఁది తమి వుట్టితేను
అండుకాచందుకు భ్రమయకుండుటే బుద్ధి
॥విష్ణుఁ॥
అట్టె యెవ్వరయినా గృహారామాదులపై నాస
పుట్టించితేఁ వానివెంటఁ బోనిదే బుద్ధి
చుట్టపు సమ్మంధాన సోఁకితే పరబాధలు
చుట్టుకోక లోనుగాక జునుఁగుటే బుద్ధి
॥విష్ణుఁ॥
తప్పదింతా దైవికమే తనవద్ద నున్నవారిఁ
దప్పులు పట్టనిదే తగిన బుద్ధి
యెప్పుడూ శ్రీవేంకటేశుఁ డెదలోన నున్నవాఁడు
చొప్పెత్తి యాతని మూర్తి చూచుటే బుద్ధి
॥విష్ణుఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము