Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 144-4
సంపుటము: 2-197
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: భైరవి
ఇంతకంటే నే మున్నది యెంత దలపోసినాను
చింతదీర నీసేవ సేయుటే కలది
॥పల్లవి॥
ఉపకారముగ దేహమొసఁగితి విటు నాకు
ఉపమించి నేఁజేసే ప్రత్యుపకార మిఁక నేది
యెపుడూ నీధర్మమున నిటు నీరుణస్థుఁడనై
ప్రపన్నుఁడనై నేను బ్రదుకుటే కలది
॥ఇంత॥
వేవేగ వెఱ్ఱి జేయక వివేకిఁ జేసితివి
యీవికి నే మారుకు మా రిచ్చే దెక్కడ నున్నది
యీవల నీకుఁ గీర్తిగా నిట్టే నీయాధీనుఁడనై
భావించి భయము లేక బ్రదుకుటే కలది
॥ఇంత॥
జడులలోఁ గూర్చక యాచార్యునిలోఁ (తోఁ?) గూర్చితివి
నడపేటి నీసరవికి నాసరివి యేమున్నది
యెడయక శ్రీవేంకటేశ నీకు బంటనై
బడివాయ కిట్లా నే బ్రదుకుటే కలది
॥ఇంత॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము