అధ్యాత్మ సంకీర్తన
రేకు: 144-6
సంపుటము: 2-199
రేకు: 144-6
సంపుటము: 2-199
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: శ్రీరాగం
| ఇంతేకాని తెలిసితే నెవ్వరూఁ గర్తలు గారు బంతినే వీని కెప్పుడుఁ బ్రకృతి గారణము | ॥పల్లవి॥ |
| యివిగో గుణాలు మూఁడే యింద్రియాలఁ గూడుకొని భువిఁ బ్రాణులనెల్లాను పూఁచి పనులుగొనేవి కవిసి కర్మములై ఘనలోకాలఁ దిప్పేవి ఆవలఁ బుట్టుగులకు నప్పటిఁ దెచ్చేవి | ॥ఇంతే॥ |
| పంచభూతా లివియే పరగ జీవులకెల్లా దించరాక యెప్పుడును దేహాలయ్యేవి అంచెలఁ గంచములోఁ బదార్థములై వుండినవి తెంచరాని పాశములై తీపులఁ బెట్టేవి | ॥ఇంతే॥ |
| మనసొక్కటే జంతుల మర్మములు రేఁచేది తనుభోగములలోనఁ దనివిచ్చేది అనయము శ్రీవేంకటాధిప నీ మహి మిది నినుఁ గొల్చిన దాసుల నెరవేర్చేది | ॥ఇంతే॥ |


