Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 145-1
సంపుటము: 2-200
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: దేసాళం
భావించలే రెవ్వరును బయలు వాఁకేరు గాని
నీవే గుఱుతు మాకు నీరజనాభా
॥పల్లవి॥
కైవల్య మెట్టుండునో నిక్కపు జ్ఞాన మెట్టుండునో
దైవిక మెట్టుండునో తలఁచరాదు
జీవన మెట్లనుండునో చిత్త మేరీతి నుండునో
ఆవిధ మెవ్వరి కిట్టట్టనఁగరాదు
॥భావిం॥
వేదము లెట్టుండునో విరతి యెట్టుండునో
ఆది నంత మెట్టుండునో అరయరాదు
భేదమనే దెట్టుండునో అభేదమది యెట్టుండునో
సోదించి యెవ్వరికిని చూడఁగరాదు
॥భావిం॥
ఫల మెట్లానుండునో భ క్తి యెట్లానుండునో
తెలివి యెట్టుండునో సాధించఁగరాదు
యిలపై శ్రీవేంకటేశ యిటు నీశరణుచొచ్చి
నిలుకడై వున్నారము నీకృప యిఁకను
॥భావిం॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము