Display:
అధ్యాత్మ సంకీర్తన
రేకు: 145-2
సంపుటము: 2-201
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: గౌళ
ఒడఁబరుచుకొంటివి వుపేంద్ర నిన్ను నిపుడె
చిడిముడి నీసేవకే సెలవు చేసుకొమ్మీ
॥పల్లవి॥
కన్నుల నేఁ జూచేదెల్లా కమలాక్ష నీపాదాలే
విన్నవినుకులెల్లా విష్ణుఁడ నీకథలే
తిన్నని నామాటలెల్లా త్రివిక్రమ నీమంత్రాలే
అన్నిటా నాభావము సమర్పణము నీకును
॥ఒడఁ॥
అట్టె నే నడచేవెల్లా హరి నీప్రదక్షిణాలే
గుట్టున నాసేఁతలెల్లా గోవింద నీకైంకర్యాలే
ముట్టి నేభజించినవి ముకుంద నీప్రసాదాలే
నెట్టన నాభోగమెల్లా నీవసము చేసితి
॥ఒడఁ॥
యిల నేఁ బండఁబడేవి యీశ్వర నీకు మొక్కులే
తలఁచే నాతలఁపెల్లా దామోదర నీధ్యానమె
నలువంక శ్రీవేంకటనాయక నీయనుజ్ఞను
నెలవై నాభవములెల్లా నీసొమ్ము చేసితి
॥ఒడఁ॥
AndhraBharati AMdhra bhArati - telugu కీర్తన సాహిత్యము