అధ్యాత్మ సంకీర్తన
రేకు: 146-3
సంపుటము: 2-208
రేకు: 146-3
సంపుటము: 2-208
తాళ్లపాక అన్నమాచార్య
రాగము: సాళంగనాట
| ఈతఁడు తారక బ్రహ్మమితఁడు మాదేవుఁడు కౌతుకానఁ జెప్పే వినఁగదరే వో జనులు | ॥పల్లవి॥ |
| రాముఁడు యిందీవరశ్యాముఁడు నానాసార్వ- భౌముఁడు షోడశకళాసోముఁడు దోమటిరాక్షసులను తుత్తుమురు సేసినాఁడు కామితఫలములిచ్చి కాచినాఁడు సురల | ॥ఈతఁ॥ |
| పూర్ణుఁడు నీలమేఘవర్ణుఁడు దానమున వి- స్తీర్ణుఁడు వాహనసువర్ణుఁడు అర్ణవము దాఁటి రావణాదుల గెలిచినాఁడు నిర్ణయించి చెప్పరాదు నేఁడీతని మహిమ | ॥ఈతఁ॥ |
| వరుఁడు సీతకు పరాత్పరుఁడు కోదండదీక్షా- గురుఁడు దివ్యామోఘశరుఁ డితఁడు నిరతి శ్రీవేంకటాద్రి నెలవై యుండేటివాఁడు సరి భరతలక్షణశత్రుఘ్న సహితుఁడు | ॥ఈతఁ॥ |


